22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం

  • బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల భూ సమస్యకు పరిష్కారం
  • 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం
  • బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకూ విముక్తి
  • తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు
  • రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని సీఎం వెల్లడి
నంద్యాల జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న క్లిష్టమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలోనే తక్షణ పరిష్కారం చూపారు. బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతుల 2,074 ఎకరాల భూములను నిషేధిత 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పించారు. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా, బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలోనే అధికారుల సమక్షంలో మొత్తం ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించి, రైతులకు విముక్తి పత్రాలను అందజేశారు. గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించిన సీఎం, ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.

అక్కడికక్కడే పరిష్కారం 
ఈ ఏడాది మార్చి 9న డోన్ పర్యటనలో గుటుపల్లి రైతులు తమ భూములను గత ప్రభుత్వం అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చిందని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిని గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి, గురువారం బనగానపల్లె పర్యటనలో ఆ రైతులను ప్రత్యేకంగా తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. 

సమస్య పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో చర్యలు పూర్తయ్యాయని, జిల్లా స్థాయిలో ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. కలెక్టర్ నుంచి అధికారిక ఉత్తర్వులు అందనందున ఆన్‌లైన్ ప్రక్రియ మొదలు కాలేదని రిజిస్ట్రార్ చెప్పడంతో, సీఎం అక్కడికక్కడే కలెక్టర్‌తో మాట్లాడి ఉత్తర్వులను రిజిస్ట్రార్‌కు అందజేశారు. "త్వరలోనే పూర్తి చేస్తాం" అని అధికారి చెప్పగా, "త్వరలో కాదు, ఇప్పుడే పూర్తి చేయండి" అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి, గుటుపల్లికి చెందిన 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి ఆన్‌లైన్‌లో తొలగించారు. ఇదే స్ఫూర్తితో బనగానపల్లె పట్టణానికి చెందిన 23 మంది రైతుల 101 ఎకరాల చుక్కల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తప్పించారు.

రైతుల ఆనందం
తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములు తమ పేరు మీదే ఉన్నా, గత ప్రభుత్వ చర్యల వల్ల అమ్ముకోలేక, వ్యవసాయ రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు ముఖ్యమంత్రి వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యకు ఇంత వేగంగా, స్వయంగా ముఖ్యమంత్రి చొరవతో పరిష్కారం లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్రంలో ఎక్కడా రైతులు ఇబ్బంది పడకూడదన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి 
బేతంచర్ల తరహాలోనే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ వివాదాలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుంది గ్రామాల్లోని భూ సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపింది. రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులను తొలగిస్తూ, లక్షలాది ఎకరాలకు విముక్తి కల్పిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో వేలాది మంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయడం ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

Nara Chandrababu Naidu
Gutupalli farmers
Section 22A land removal
Nandyal district news
Andhra Pradesh agriculture
Banaganapalle land issue

More Telugu News